- పోలీస్ స్టేషన్, సచివాలయం పరిశీలన.. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
శ్రీశైలం, ఆగస్టు 1 (చైతన్యగళం):
నంద్యాల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సునీల్ షొరాణ్ శుక్రవారం సుండిపెంటలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా సుండిపెంట పోలీస్ స్టేషన్‌తో పాటు సచివాలయం–2 భవనం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీసు సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని సిబ్బందికి సూచించారు.
సుండిపెంట ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత, వాహనాల రాకపోకల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలను సందర్శించిన ఎస్పీ, విద్యార్థులతో మమేకమై క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకోవడంతో పాటు చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో డీఎస్పీ ఆర్.ఆర్. నాయక్, సీఐ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
