- ప్రజా భవన్లో రాష్ట్ర నిపుణుల కమిటీ సమావేశం
- తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ తరఫున కె.వి.ఎన్. రెడ్డి కీలక సూచనలు
హైదరాబాద్, జూలై 22 (చైతన్యగళం): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, శాస్త్రీయ విధానాల అమలే కీలకమని తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ ప్రతినిధి కె.వి.ఎన్. రెడ్డి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిస్థితులకు అనుగుణంగా కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని సూచించారు.
హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి అధ్యక్షతన, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. గోపి కన్వీనర్‌గా ఎల్‌నినో పరిస్థితులు, వాటి ప్రభావం, రాష్ట్ర స్థాయి కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికపై నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ తరఫున ప్రత్యేక ఆహ్వానితుడిగా (స్పెషల్ ఇన్వైటీ) హాజరైన కె.వి.ఎన్. రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు వాతావరణ ఆధారిత సాంకేతిక సలహాలను సకాలంలో అందించాలని కోరారు.

వర్షపు నీటిని వృథా కాకుండా వినియోగించేందుకు ఇంకుడు గుంటలు, చెక్‌డ్యాంలు, వర్షపు నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని, భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి పశుగ్రాస ఉత్పత్తి, నిల్వ, పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఉద్యానవన రంగం రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్న ఆయన, ఉద్యాన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు అవసరమైన కొత్త నియామకాలు చేపట్టి శాఖను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సూక్ష్మ నీటిపారుదల, మల్చింగ్ వంటి నీటి పొదుపు సాంకేతికతలను విస్తృతంగా ప్రోత్సహించడం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు.
వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల, వాతావరణ శాఖలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర పరిశోధనా సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి రైతులకు సకాలంలో శాస్త్రీయ మార్గదర్శకాలు అందించాలని కె.వి.ఎన్. రెడ్డి సూచించారు. దీంతో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కమిషన్ తరఫున చేసిన సూచనలను సమావేశంలో పాల్గొన్న అధికారులు, నిపుణులు సానుకూలంగా స్వాగతించారు. రాష్ట్ర స్థాయి కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడినట్లు సమావేశంలో వెల్లడైంది.
