- పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.. ప్రతి చిన్నారి ఆరోగ్యమే మన బాధ్యత
ఆమనగల్, నవంబర్ 22 (చైతన్యగళం): ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు. చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు సీత, దస్తగిరి, ఆశా కార్యకర్త సంతోష తదితరులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు కృషి చేశారు.

