Saturday, November 21, 2026
Homeతెలంగాణయువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

  • చదువుపై దృష్టి సారించి లక్ష్యాల వైపు ముందుకు సాగాలి.. కల్వకుర్తి ఎక్సైజ్‌ ఎస్‌ఐ చాంద్‌ బి., జాతీయ యువజన అవార్డు గ్రహీత శివకుమార్‌

కల్వకుర్తి, నవంబర్‌ 21 (చైతన్యగళం): యువత మత్తు పదార్థాలు, మద్యానికి దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని కల్వకుర్తి ఎక్సైజ్‌ శాఖ ఎస్‌ఐ చాంద్‌ బి. సూచించారు. చిన్న వయస్సులోనే మత్తు పదార్థాలకు అలవాటుపడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.

కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవా బృందం, మై భారత్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ‘నషా ముక్త్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ‘మత్తు పదార్థాల రహిత యువత’ అనే అంశంపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, యువ పార్లమెంట్‌ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌, మద్యం వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎక్సైజ్‌ ఎస్‌ఐ చాంద్‌ బి. మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్షలు పడే అవకాశం ఉందని విద్యార్థులకు వివరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

జాతీయ యువజన అవార్డు గ్రహీత శివకుమార్‌ మాట్లాడుతూ.. యువత దేశానికి ఆస్తి అని, అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని, అన్ని రంగాల్లో ముందుండి దేశం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం యువ పార్లమెంట్‌ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మహబూబ్‌ అలీ, పరశురాములు, స్వాతి, మల్లయ్య, రాజేష్‌, సేవా బృందం సభ్యుడు హర్షిత్‌, ఎక్సైజ్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!