- ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం: బీఆర్‌ఎస్ నాయకుల హెచ్చరిక
తలకొండపల్లి, నవంబర్ 21 (చైతన్యగళం): తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 240 నూతన పీఏసీఎస్‌ల జాబితాలో గట్టుఇప్పలపల్లికి చోటు కల్పించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తలకొండపల్లి గ్రామం తర్వాత మండలంలో అత్యధిక జనాభా, విస్తీర్ణం కలిగిన గ్రామంగా గట్టుఇప్పలపల్లి ఉందని నాయకులు పేర్కొన్నారు. పీఏసీఎస్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ గ్రామాన్ని ఎంపిక చేయకపోవడం అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గట్టుఇప్పలల్లిని మండలంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాజాగా పీఏసీఎస్ కేంద్రం ఏర్పాటు విషయంలోనూ గ్రామానికి అన్యాయం జరుగుతోందని అన్నారు.
గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను కలిసి గట్టుఇప్పలపల్లిలో పీఏసీఎస్ కేంద్రం ఏర్పాటుకు హామీ తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జయమ్మ వెంకటయ్య, గ్రామ అధ్యక్షుడు ఏదుల రాజు, ఉపాధ్యక్షుడు కానుగుల జంగయ్య, మండల కృష్ణయ్య, శరత్ చంద్రశర్మ, విజేందర్ యాదవ్, సాధిక్, బొల్లి కృష్ణ, కొండల్, ఇట్యాల రవీందర్, శ్రీశైలం, పురుషోత్తం, రత్నయ్య, ఆంజనేయులు, ప్రవీణ్, మల్లేష్, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

