హుస్నాబాద్ నవంబర్ 9 {చైతన్యగళం}:
సిద్దిపేట–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మృతి చెందడంపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన కుమార్తె మహాన్వి (9) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడం తీరని విషాదమని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ భార్య స్వాతికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులను కోరారు. తల్లి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రోడ్డు ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.

