హుస్నాబాద్, నవంబర్ 10 (చైతన్యగళం):
హుస్నాబాద్ మండలం పందిళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్, ఆయన కుమార్తె మహాన్వి మృతిచెందడం తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపు సురేందర్ రెడ్డి అన్నారు. వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
పండుగ వేళ తండ్రి, కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం, శ్రీకాంత్ భార్య స్వాతి, కుమారుడు శ్రీహన్ తీవ్రంగా గాయపడటం తనను కలచివేసిందన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు.
రోడ్డు ప్రయాణికులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జన్నపు సురేందర్ రెడ్డి సూచించారు.
