- ప్రజల ఆదరణతో విజయం సాధిస్తా.. స్వతంత్ర అభ్యర్థి ఆర్. వసంతకుమారి ధీమా
నందికొట్కూరు (చైతన్యగళం): నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని గ్యాస్ సిలిండర్ గుర్తుపై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఆర్. వసంతకుమారి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని సాయిబాబాపేట, లింగం వీధి తదితర కాలనీల్లో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి వీధివీధినా పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
వసంతకుమారికి తొగట వీర క్షత్రియ సంఘం, చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యులు మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలకతీతంగా ఆమెకు అండగా నిలవాలని మద్దతుదారులు కోరుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర అభ్యర్థిగా ఆమె ప్రచారం నిర్వహిస్తుండటంతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.
బీసీ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పదవికి ఐదుగురు మహిళలు పోటీలో ఉండటంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల మధ్య పోటీ, ఓట్ల చీలిక వంటి అంశాలు ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ సాగుతోంది. ప్రజల ఆదరణతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటాననే విశ్వాసంతో వసంతకుమారి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యులు, గూడూరు రవికుమార్, సిలిండర్ గుర్తుకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
