- అధికారులకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశం
నందికొట్కూరు, అక్టోబర్ 25 (చైతన్యగళం): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఆదివారం నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆమె పరిశీలించారు.
ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లతో పాటు ఓట్ల లెక్కింపునకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ, పట్టణ సీఐ మురళీధర్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

