- మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ షఫీయా ప్రకటన.. కాంగ్రెస్‌లో పలువురి చేరిక
నందికొట్కూరు, అక్టోబర్ 16 (చైతన్యగళం): నందికొట్కూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తేనే నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏఐసీసీ సభ్యుడు, మాజీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, కర్నూలు జిల్లా ఇన్చార్జి జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, నంద్యాల జిల్లా ఇన్చార్జి కోపు పౌల్ విజయ్‌కుమార్, నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మద్దిలేటి స్వామి శుక్రవారం ప్రారంభించారు. నాయకులంతా కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నందికొట్కూరు పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు షేక్ సమీర్, సిదేశ్వరం షేక్ షఫీయా, షేక్ వారిష్, కబీర్, అత్తావుర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే పాములపాడు మండల అధ్యక్షుడు సయ్యద్ షేక్ షా అలీ ఆధ్వర్యంలో ఇస్కాల గ్రామానికి చెందిన షేక్ ముర్తుజా, యూసుఫ్‌తో పాటు సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తొలి జాబితాలో భాగంగా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ షఫీయాను తేనే నాగరాజు ప్రకటించారు.
ఈ సందర్భంగా తేనే నాగరాజు మాట్లాడుతూ, పట్టణంలోని చెత్త డంపింగ్ యార్డు సమస్యపై టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడానికే పరిమితమవుతున్నారని ఆరోపించారు. స్థానిక, స్థానికేతర అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ విమర్శలు చేయడం తప్ప ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. పట్టణం మధ్యలో ఉన్న డంపింగ్ యార్డు వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, రోడ్డు విస్తరణ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డంపింగ్ యార్డును మరోచోటుకు తరలించాలని డిమాండ్ చేశారు.
ఏఐసీసీ సభ్యుడు జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కులం, మతం పేరుతో రాజకీయాలు చేయకుండా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఇన్చార్జి కోపు పౌల్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ, జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని తొలి కేంద్ర మంత్రివర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఉప ప్రధానిగా, హోంమంత్రిగా, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. దేశంలో మతసామరస్యం, మానవత్వం, సమానత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఉస్మాన్ బాషా, నందికొట్కూరు నాయకులు సమీర్, ఇంతియాజ్, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎం. సికిందర్, పాములపాడు మండల అధ్యక్షుడు సయ్యద్ షేక్ షా అలీ, నందికొట్కూరు అధ్యక్షుడు సుంకన్న గౌడ్, మనోహర్, జూపాడుబంగ్లా మండల అధ్యక్షుడు షేక్ షావలి, ఉపాధ్యక్షుడు మాసూమ్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు అత్త ఉల్లా, ఉపాధ్యక్షుడు మోహన్‌తో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
