- తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలను గుర్తించాలి: దండోజు గంగాధర్
కల్వకుర్తి, సెప్టెంబరు 28 (చైతన్యగళం): ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు దండోజు గంగాధర్ డిమాండ్ చేశారు. తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలను గుర్తించి నష్టపోయిన పంటలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు.
పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు పెట్టుబడులు నష్టపోయి నిరాశకు గురయ్యారని గంగాధర్ పేర్కొన్నారు. రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులకు పంట నష్ట సమయంలో బీమా రక్షణ అందడం లేదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
