Sunday, September 13, 2026
Homeతెలంగాణకరీంనగర్అర్హులైన ఓటు ఒక్కటీ మిస్‌ కావొద్దు

అర్హులైన ఓటు ఒక్కటీ మిస్‌ కావొద్దు

📰 Generate e-Paper Clip

  • నో మ్యాపింగ్‌ ఓటర్ల పరిశీలనలో అప్రమత్తంగా ఉండాలి
  • నోటీసులు అందుకున్న వారి నుంచి పత్రాలు తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్ల జాబితా పరిశీలనను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నో మ్యాపింగ్‌ ఓటర్ల విషయంలో ఆధారాలు లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. నోటీసులు అందుకున్న వారి నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఓటర్లలో ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుంచి మిస్‌ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌లో భాగంగా నో మ్యాపింగ్‌ ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు కలెక్టర్‌ చిత్రా మిశ్రా శుక్రవారం సాయంత్రం తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. తహసీల్దార్‌ కర్ర శ్రీనివాస్‌రెడ్డి నుంచి ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పత్రాల పరిశీలన తప్పనిసరి

నో మ్యాపింగ్‌, సవరణలకు సంబంధించి నోటీసులు అందించిన ప్రతి వ్యక్తి నుంచి అవసరమైన పత్రాలను సేకరించాలని కలెక్టర్‌ సూచించారు. వాటిని బీఎల్‌వోల యాప్‌లో భద్రపరిచి జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల వారీగా బీఎల్‌వోలు చేపడుతున్న ప్రక్రియను రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

తొలగింపులపై ప్రత్యేక దృష్టి

ఓటర్ల పేర్ల తొలగింపు విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని చిత్రా మిశ్రా ఆదేశించారు. అర్హులైన ఓటరు పేరు పొరపాటున కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు. నోటీసులు అందించిన వారి నుంచి సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకుని, వాటి ఆధారంగానే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నో మ్యాపింగ్‌ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని, తేదీల వారీగా ఓటర్ల పేర్లు, నోటీసులు జారీ చేసిన కారణాలు, సమర్పించిన పత్రాల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఫారం–6, 7, 8పై జాగ్రత్త

కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం–6, ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారి పేర్ల తొలగింపునకు సంబంధించిన ఫారం–7 విషయంలో నిబంధనల మేరకు జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫారం–8 దరఖాస్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నో మ్యాపింగ్‌ జాబితా పరిశీలనను సమగ్రంగా పూర్తి చేయాలని, ఈ ప్రక్రియపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కర్ర శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ వేముల శ్రీనివాస్‌తో పాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!