- కల్తీ స్వీట్లు ధ్వంసం.. భారీగా ముడి పదార్థాల స్వాధీనం
కరీంనగర్ (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ఆహార వ్యాపార సంస్థల్లో ఆహార భద్రత అధికారి రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలను గుర్తించి చర్యలు చేపట్టారు.
కరీంనగర్‌లోని బౌపేటలో బాలాజీ మ్యాజిక్ మిఠాయి తయారీ కేంద్రంలో తీవ్ర పరిశుభ్రత లోపాలు గుర్తించారు. పాలతో తయారు చేయాల్సిన అజ్మేరి కలాకండ్, మిల్క్ మైసూర్‌పాక్‌లను పాలు ఉపయోగించకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 40 కిలోల స్వీట్లను అక్కడికక్కడే ధ్వంసం చేయడంతో పాటు 1,300 కిలోల మైదా, చక్కెర తదితర ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థను మూసివేసి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నమోదు ధ్రువపత్రం నిలిపివేతకు చర్యలు ప్రారంభించారు.
కూచిపూడి రెస్టారెంట్‌లో వంటశాల, ఆహార నిర్వాహకుల పరిశుభ్రత లోపాలను గుర్తించి సరిదిద్దాలని మెరుగుదల నోటీసు జారీ చేశారు. గీతాభవన్ చౌరస్తాలోని ఫేమస్ హోటల్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించి మూసివేశారు. లైసెన్స్ పొందిన అనంతరం మాత్రమే తిరిగి కార్యకలాపాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
గీతాభవన్ చౌరస్తా సమీపంలోని మతామ్ అల్ హబీబి అరేబియన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కృత్రిమ రంగుల వినియోగం, వంటశాలలో బొద్దింకల సంచారం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. సుమారు 8 కిలోల హాండీ రైస్‌ను పారవేయించి, సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను నిలిపివేశారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించారు. ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
