- రోడ్డుపై నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్.. పోలీసులతో బీజేపీ నాయకుల తోపులాట
జగిత్యాల (చైతన్యగళం): రైతు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, విద్యుత్ కోతలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతే, రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో జగిత్యాల నుంచి కోరుట్ల వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ధర్నా విరమించాలని పోలీసులు కోరడంతో కొద్దిసేపు పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి కోతలపై వివరణ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని నాయకులు పట్టుబట్టారు.
అయితే రహదారిపై అంబులెన్సులు, వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పోలీసులు నచ్చజెప్పడంతో నాయకులు ధర్నాను విరమించారు. తక్షణమే విద్యుత్ కోతలు నిలిపివేయాలని, లేనిపక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చిట్యాల సురేష్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ప్రధాన కార్యదర్శి కారండ్ల మధుకర్, రాష్ట్ర నాయకులు కొడిపల్లి గోపాల్‌రెడ్డి, క్యాతం దశరథరెడ్డి, అన్నడి జలపతిరెడ్డి, ఎస్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
