- 16వ సర్వే నంబర్ సమస్యలపై ‘భూ ప్రహారీ’ పాదయాత్ర.. తహసీల్దార్‌పై చర్యలకు డిమాండ్
ఆమనగల్లు, సెప్టెంబర్ 1 (చైతన్యగళం):
కోనాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 16వ సర్వే నంబర్‌లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు మంగళవారం ‘భూ ప్రహారీ పాదయాత్ర’ చేపట్టారు. కోనాపూర్ అంబేద్కర్ విగ్రహం నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి 16వ సర్వే నంబర్‌కు సంబంధించిన సమస్యలపై రైతుల సమక్షంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ భూ సమస్య పరిష్కారం కోసం గతంలో ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అనంతరం తమకు నకిలీ పత్రాలు తయారు చేసి ఇచ్చారని వారు ఆరోపించారు. తహసీల్దార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆమనగల్లు తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని డిమాండ్ చేశారు. 16వ సర్వే నంబర్‌లోని భూ సమస్యను పూర్తిస్థాయిలో పరిశీలించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు జానయ్య, యాదయ్య, నారయ్య, రాములు, కుమార్, చంద్రయ్య, శివ, రమేష్, ఈదన్న, వెంకటేష్, సాలయ్య తదితరులు పాల్గొన్నారు.