కరీంనగర్, ఆగస్టు 25 (చైతన్య గళం): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఖాళీ పర్సులు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
