చిగురుమామిడి, ఆగస్టు 24 (చైతన్యగళం)
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లెల్లో ప్రజాపాలన’ కార్యక్రమం చిగురుమామిడి మండలంలో విజయవంతంగా కొనసాగింది. సోమవారం కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, ఓగులాపూర్, గునుకులపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు కొండాపూర్‌లో మంత్రి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాల్వల నిర్మాణానికి రైతులు సహకరించాలని, భూసేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వర్షపు నీటి సంరక్షణకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, ప్రతి పొలంలో నీటి కుంట ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. నవాబుపేట గ్రామం ఇంకుడు గుంతల నిర్మాణంలో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలవాలని పిలుపునిచ్చారు. గునుకులపల్లిలో రైతులు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని తెలిపారు రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్‌ఫామ్, నువ్వులు, ఆముదాలు, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలు సాగు చేయాలని కోరారు. ఇందుర్తిలో దాదాపు 100 ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంపై మంత్రి అభినందించారు నవాబుపేట, కొండాపూర్‌లో ప్రజలు విద్యుత్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గునుకులపల్లిలో ఉప మార్కెట్‌యార్డు, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఓగులాపూర్‌లో చెక్‌డ్యామ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. కొండాపూర్‌లో మంజూరైన ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందించారు. నవాబుపేటలో 21, ఇందుర్తిలో 32, గునుకులపల్లిలో 36, ఓగులాపూర్‌లో 8 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరైనట్లు అధికారులు తెలిపారు ఐదు గ్రామాల్లో రైతుభరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, గృహజ్యోతి తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి భూములు, విద్యుత్, ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో ఆర్డీవో షర్మిల, డీపీవో జగదీశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో రామ్మోహనాచారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.