CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 8:08 am Posted by : CHAITHANYA GALAM NEWS

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

  • 114.196 కిలోల గంజాయి ధ్వంసం.. 25 కేసులకు సంబంధించిన నిందితుల నుంచి స్వాధీనం

గడివేముల, ఆగస్టు 24 (చైతన్యగళం): నంద్యాల, కర్నూలు జిల్లాల పరిధిలో నమోదైన 25 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 114.196 కిలోల గంజాయిని ఎక్సైజ్‌శాఖ అధికారులు ధ్వంసం చేశారు. గడివేముల మండలంలోని బిలకలగూడూరు గ్రామ సమీపంలోని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో గంజాయిని నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు. డ్రగ్స్‌ డిస్పోజల్‌ కమిటీ సభ్యులైన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్‌, కర్నూలు అసిస్టెంట్‌ కమిషనర్‌, అనంతపురం అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది.

ఈ సందర్భంగా ఎక్సైజ్‌ అధికారులు మాట్లాడుతూ నంద్యాల, కర్నూలు జిల్లాల్లో గంజాయి, ఇతర నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌, ఎక్సైజ్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ జైకృష్ణయ్యమూర్తి, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.