చిగురుమామిడి, ఆగస్టు 24 (చైతన్య గళం): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఆ పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. చిగురుమామిడి మండలం నవాబుపేటలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన పాత బకాయిలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెల్లిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అప్పట్లో మౌనంగా ఉండి, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బ్యాంకుల ద్వారా ముందస్తుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లకు ‘గ్రీన్ ఛానల్’ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో సమీకృత వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వసతి గృహాల మెస్ చార్జీలు పెంచి విద్యార్థులకు మెరుగైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలు మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని, కేంద్రంలోని తమ పార్టీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయించాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అనవసరంగా అడ్డంకులు సృష్టించవద్దని హితవు పలికారు.
