కరీంనగర్, ఆగస్టు 23 (చైతన్యగళం): నగరంలో శాంతిభద్రతల పరిరక్షణపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం అర్ధరాత్రి నగరంలో ఆకస్మికంగా పర్యటించిన సీపీ పలు ప్రాంతాల్లో రాత్రి గస్తీ, పోలీసుల అప్రమత్తతను పరిశీలించారు. రాజీవ్ చౌక్, శనివారం మార్కెట్, తెలంగాణ చౌక్‌తో పాటు బైపాస్ రోడ్డులోని దాబా ప్రాంతాలను సీపీ తనిఖీ చేశారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా కొనసాగుతున్న హోటళ్లు, దాబాలు, టీ దుకాణాలు, పాన్ దుకాణాల నిర్వాహకులతో మాట్లాడి సమయపాలన పాటించాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనుమతించిన సమయం తర్వాత కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని సీపీ గౌష్ ఆలం తెలిపారు.