- అమెరికా–ఇరాన్ వివాదం మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్, అమెరికా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. హోర్ముజ్ జలసంధిని **‘కొత్త అమెరికా భూభాగం’**గా పేర్కొంటూ ట్రంప్ సోషల్ మీడియాలో ఓ మ్యాప్‌ను షేర్ చేశారు.
గత కొద్ది రోజులుగా హోర్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటించే అంశాన్ని ప్రస్తావిస్తున్న ట్రంప్.. అమెరికా నౌకాదళం ఆ ప్రాంతంలో నియంత్రణ కొనసాగిస్తోందని చెబుతున్నారు. సోమవారం కూడా ఆయన మాట్లాడుతూ హోర్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటించాలనే ఆలోచన ‘మంచిదే’ అని వ్యాఖ్యానించారు. హోర్ముజ్‌పై అమెరికా నౌకాదళ నిర్బంధం కొనసాగుతోందని, జలసంధిలోని మైన్లను తొలగించినట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు.
అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనను తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్‌కు చెందిన ప్రధాన చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ.. అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు హోర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా సముద్ర నిర్బంధాన్ని ఎత్తివేయడంతో పాటు చమురు ఆంక్షలను తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు హోర్ముజ్ పరిస్థితిపై అమెరికా, ఇరాన్ ప్రకటనల్లో స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తోంది. ట్రంప్ జలసంధి పనిచేస్తోందని, అమెరికా నియంత్రణలో ఉందని చెబుతుండగా.. ఇరాన్ మాత్రం తమ షరతులు నెరవేరే వరకు దానిని మూసివేస్తామని ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కూడా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, చర్చలకు ఎలాంటి తేదీ కూడా నిర్ణయించలేదని వెల్లడించారు.
ఇదిలా ఉండగా హోర్ముజ్ సమీపంలో వాణిజ్య నౌకపై దాడి జరగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నౌకపై ప్రక్షేపకం తాకిన ఘటనలో నష్టం వాటిల్లగా, ఒక సిబ్బంది మృతి చెందినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ పరిణామం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి భద్రతపై అంతర్జాతీయ ఆందోళనలు మరింత పెరిగాయి.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన కొనసాగితే అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై, చమురు ధరలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
