Tuesday, August 18, 2026
Homeఎడిటోరియల్బాలికల ఆరోగ్యంపై అవగాహనే లక్ష్యం

బాలికల ఆరోగ్యంపై అవగాహనే లక్ష్యం

📰 Generate e-Paper Clip

  • మహబూబాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం

మహబూబాబాద్‌, ఆగస్టు 18(చైతన్యగళం): బాలికలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సకాలంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళి నాయక్‌ సూచించారు. మహబూబాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పొక్కుల సదానందం అధ్యక్షతన మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళి నాయక్‌ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏకైక ప్రభుత్వ బాలికల కళాశాలలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ఉపయోగపడేలా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కళాశాలలో చదువుతున్న సుమారు 550 మంది విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రిన్సిపాల్‌ పొక్కుల సదానందం తెలిపారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు ముందుకు వచ్చిన వెన్నెల తల్లి పిల్లల హాస్పిటల్‌ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

500 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు

వెన్నెల తల్లి పిల్లల హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ కళ్లెం జ్యోత్స్నా రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జ్యోత్స్నా రెడ్డి మాట్లాడుతూ కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను సిగ్గుపడకుండా తల్లిదండ్రులు, మిత్రులు లేదా వైద్యులతో పంచుకోవాలని సూచించారు.

పీసీఓడీ, పీసీఓఎస్‌, రక్తహీనత, పోషకాహార లోపం, రుతుక్రమ సమస్యలు, అధిక లేదా తక్కువ బరువు, చర్మ సమస్యలు, మానసిక ఒత్తిడి, పరిశుభ్రత లోపం వంటి సమస్యలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు ఆకుకూరలు, పండ్లను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ నడక, యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు.

విద్యార్థినుల ఆరోగ్యానికి ప్రాధాన్యం

ఇంటర్‌ విద్యాశాఖ అధికారి సీహెచ్‌ మదర్‌ గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థినులకు ఎంతో ఉపయోగకరమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాన్ని అభినందించారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి విద్యార్థినుల శానిటేషన్‌ అవసరాల కోసం రూ.5 వేల విరాళాన్ని ప్రిన్సిపాల్‌కు అందజేశారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జ్యోతి, వార్డు కౌన్సిలర్‌ రవి, బోళ్ల రాజు, కాట భాస్కర్‌, సల్వాయి దిలీప్‌, సరిత, బాలుర కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ గణేష్‌, నయీమ్‌ పాషా, కళాశాల అధ్యాపకులు రవికిరణ్‌, శ్రీను, కిరణ్‌, రియాజ్‌, స్వాతి, భార్గవి, సరిత, ఉప్పలయ్య, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి చొప్పరి శ్రీనివాస్‌ వందన సమర్పణ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!