CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 4:31 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జాతీయ పతాక గౌరవ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

  • అధికారులకు స్వామి వివేకానంద గ్రంథాలయ కమిటీ వినతి

తూప్రాన్‌, ఆగస్టు 14 (చైతన్యగళం): స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక గౌరవాన్ని, పవిత్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్వామి వివేకానంద గ్రంథాలయ కమిటీ, మనోహరాబాద్‌ ఆధ్వర్యంలో అధికారులను కోరారు. ఈ మేరకు తూప్రాన్‌ డీఎస్పీ, సీఐ, మనోహరాబాద్‌ ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కమిటీ సభ్యులు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థల్లో జాతీయ పతాకాన్ని నిర్దేశిత నిబంధనల ప్రకారం ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ పతాకాన్ని అలంకరణ వస్తువుగా, స్వాగత తోరణాలుగా లేదా ఇతరత్రా అనుచిత రీతిలో ఉపయోగించకుండా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.

తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థలకు జాతీయ పతాక వినియోగ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ముందస్తుగా నోటీసులు జారీ చేయాలని అధికారులను కోరారు. జాతీయ పతాకాన్ని అవమానించే విధంగా ఎలాంటి చర్యలు జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

అలాగే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం, మాంసం దుకాణాల మూసివేతకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాక పవిత్రతను పరిరక్షించేందుకు అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.