టీజేఏ సిద్దిపేట జిల్లా సమావేశంలో పలు కీలక తీర్మానాలు
సిద్దిపేట, ఆగస్టు 9 (చైతన్యగళం ): జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. జర్నలిస్టులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.సిద్దిపేట పట్టణంలోని వైశ్య భవన్‌లో ఎన్‌యూజే ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు, టీజేఏ నాయకులు ఉక్కలకర రాజేందర్‌నాథ్ అధ్యక్షతన జిల్లా సమావేశం నిర్వహించారు. టీజేఏ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్‌యూజే ఇండియా కార్యవర్గ సభ్యులు డి. రాజలింగం, టీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్. గౌరీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత నీలకంఠం, సీనియర్ సభ్యులు కే. సత్యనారాయణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.సమావేశంలో జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమానికి ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు, హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, దీర్ఘకాలంగా జర్నలిజం రంగంలో సేవలందిస్తున్న వృద్ధ జర్నలిస్టుల ఇబ్బందులను కూడా సమావేశం చర్చించింది.
జర్నలిస్టుల కుటుంబాల భవిష్యత్తు, నివాస, వైద్య, ప్రయాణ సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని నాయకులు కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.జిల్లా కమిటీ పునర్వ్యవస్థీకరణకు తీర్మానం సిద్దిపేట జిల్లాలో టీజేఏను మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే దిశగా జిల్లా కమిటీని పునర్వ్యవస్థీకరించాలని తీర్మానించారు. జిల్లాలోని జర్నలిస్టులను సంఘటితం చేసి, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కమిటీ చురుకైన పాత్ర పోషించాలని నిర్ణయించారు.ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి ఇంటి స్థలాలు లేని అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం స్థలాలు కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు. ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు కోరారు. హైపవర్ కమిటీలను పునరుద్ధరించాలి రాష్ట్ర, జిల్లా హైపవర్ కమిటీలను వెంటనే పునరుద్ధరించాలని సమావేశం తీర్మానించింది. జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత స్థాయిలో సమన్వయం జరిగేలా ఈ కమిటీలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు అందించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సముచిత వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని తీర్మానించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య కార్డుల ద్వారా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం సంబంధిత ఆసుపత్రులతో సమన్వయం చేయాలని కోరారు.
75 ఏళ్లు దాటిన వృద్ధ జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్జ ర్నలిజం రంగంలో ఎన్నో సంవత్సరాలు సేవలందించిన 75 ఏళ్లకు పైబడిన వృద్ధ జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని మరో కీలక తీర్మానం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టులకు ఈ సౌకర్యం కొంత భరోసా కల్పిస్తుందని నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టుల ఐక్యతే బలం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సమస్యలను పరిష్కరించుకోవడం కంటే జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన తీర్మానాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన అమలు చేయాలని టీజేఏ నాయకులు కోరారు. సిద్దిపేట జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో టీజేఏ నాయకులు, సభ్యులు, జిల్లాలోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.