- సర్వే నంబర్ 16 రిజిస్ట్రేషన్లు నిలిపివేసి 46 మంది రైతులకు న్యాయం చేయాలని డిమాండ్
ఆమనగల్లు, జూలై 28 (చైతన్యగళం): ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 16 భూముల వివాదం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే నిలిపివేసి అసలు హక్కుదారులైన 46 మంది రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆమనగల్లు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సర్వే నంబర్ 16లో 46 మంది రైతులకు భూములు ఉండగా, కొందరి వద్ద పట్టాదారు పత్రాలు ఉన్నప్పటికీ భూముల స్వాధీనం లేకపోవడం, మరికొందరికి తమ భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం కుమ్మరులు, కమ్మరులు, మాలలు, మాదిగలు, ఎరుకల వంటి కులవృత్తుల కుటుంబాలకు ఈ భూములను కేటాయించిందని తెలిపారు. అయితే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాల ఆధారంగా భూములను తమ పేర్లపై పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎమ్మార్వో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగానే మరో వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి, సర్వే నంబర్ 16లో అన్ని రిజిస్ట్రేషన్లను నిలిపివేసి అసలు హక్కుదారులైన 46 మంది రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో కోనాపూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, బాధిత రైతులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని ప్రభుత్వాన్ని వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
