CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:16 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గడివేములలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

గడివేముల, జూలై 25 (చైతన్యగళం):
గడివేముల మండలం బూజనూరు స్వర్ణగ్రామాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పచ్చదనం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజా సేవల అమలు వంటి అంశాలను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

గ్రామంలో రెవెన్యూ సేవలు, వీఆర్వో, గ్రామ కార్యదర్శి పనితీరుపై ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకున్న కలెక్టర్, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తరువాత బూజనూరు ఎంపీపీ పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారికి సూచించారు. మెగా పీటీఎం–4.0 ఏర్పాట్లు, బోధన విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.