Tuesday, July 21, 2026
Homeతెలంగాణతాటి చెట్లు నరికించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: గీత పనివారల సంఘం

తాటి చెట్లు నరికించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: గీత పనివారల సంఘం

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్, జూలై 20(చైతన్యగళం): తాళ్ల సంకీస గ్రామంలో గీత వృత్తిపై ఆధారపడిన తాటి చెట్లను అక్రమంగా నరికించిన కొండపల్లి శ్రీదేవిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, గీత కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం మహబూబాబాద్ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గీత కార్మికులు నిరసన చేపట్టి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దొంతు రామ్మూర్తి గౌడ్, జిల్లా కోశాధికారి నక్క నాగార్జున గౌడ్ మాట్లాడుతూ కురవి, సీరోలు మండలాల పరిధిలోని తాళ్ల సంకీస, ఉప్పరగూడెం, మోదుగులగూడెం గౌడ సొసైటీలకు చెందిన గీత కార్మికులు అనేక సంవత్సరాలుగా తాటి చెట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తాళ్ల సంకీస శివారులోని సుమారు 300 తాటి చెట్లలో ఇప్పటికే దశలవారీగా చెట్లను నరికివేస్తున్నారని ఆరోపించారు.

2023లో 120 తాటి చెట్లు, 200 ఈత చెట్లు నరికివేసిన ఘటనపై కేసులు నమోదైనప్పటికీ సంబంధిత వ్యక్తి తీరు మారలేదని పేర్కొన్నారు. తాజాగా మరో 15 తాటి చెట్లను నరికించారని, దీంతో సుమారు 200 గీత కార్మిక కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందన్నారు.

గీత కార్మికులు ప్రశ్నించగా “నా భూమి, నా ఇష్టం” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ఈ తాటి వనం అనేక సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖ పరిధిలో నమోదై ఉండటంతో పాటు గౌడ సొసైటీ సభ్యులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు చెల్లిస్తూ గీత వృత్తి నిర్వహిస్తున్నారని తెలిపారు.

తాటి చెట్లను దైవసమానంగా భావించే గీత కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు తగిన నష్టపరిహారం అందించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో తాళ్ల సంకీస, ఉప్పరగూడెం, మోదుగులగూడెం గ్రామాల గీత పనివారల సంఘం నాయకులు గండు శ్రీశైలం గౌడ్, కొత్త సోమయ్య గౌడ్, గండి వెంకట మల్లు గౌడ్, గాడిపెల్లి రాములు గౌడ్, హెల్ది అర్జున్ గౌడ్, ఐలి నరహరి గౌడ్, కొత్త వీరన్న గౌడ్, కొత్త మల్లయ్య గౌడ్, ఐలి వెంకన్న గౌడ్, పామర్తి వెంకన్న గౌడ్, బొమ్మగాని వీరన్న గౌడ్, ఐలి శీను గౌడ్, గునిగంటి సాయిల్ గౌడ్, బొంపెల్లి ఉప్పలయ్య గౌడ్, రణం వెంకన్న గౌడ్, బసవ కొమరయ్య గౌడ్, అంబటి గోవర్ధన్ గౌడ్, కొంపెల్లి వీరన్న గౌడ్, బసవ మణి గౌడ్, కొత్త వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గీత వృత్తిని పరిరక్షించి గీత కార్మికుల జీవనోపాధిని కాపాడాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!