Sunday, July 19, 2026
Homeజాతీయంచరిత్ర సృష్టించిన విక్రమ్-1.. స్కైరూట్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని

చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. స్కైరూట్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని

📰 Generate e-Paper Clip

భారత తొలి ప్రైవేటు అంతరిక్ష ప్రయోగం ‘విక్రమ్-1’ విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ టీమ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారాయన.

భారత తొలి ప్రైవేటు అంతరిక్ష ప్రయోగం ‘విక్రమ్-1’ విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో ఫోన్‌లో మాట్లాడి, వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మోదీ. ఈ ప్రయోగాన్ని తాను ప్రత్యక్షంగా వీక్షించినట్టు చెప్పిన ఆయన.. ఈ ఘనత దేశానికి గొప్ప విజయమని అభివర్ణించారు. భారత అంతరిక్ష ప్రయాణంలో ఇదో కీలక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.

‘ప్రయోగాన్ని నేను ప్రత్యక్షంగా వీక్షించాను. దీని వెనుక ఎందరో యువ ఇంజినీర్ల శ్రమ దాగుంది. మొత్తం బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇది ఆరంభం మాత్రమే. ఈ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి’ అని స్కైరూట్‌ టీమ్‌ను ప్రోత్సహించారు మోదీ. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందం త్వరలో తనను కలవాలని ఫోన్ ద్వారా ఆహ్వానించారు.

అంతరిక్ష రంగంలో భారత్ స్వావలంబన దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఈ ప్రయోగం ప్రపంచానికి చాటిచెప్పిందని మోదీ అభిప్రాయపడ్డారు. ‘అంతరిక్ష రంగంలోనూ భారత్ ఆత్మనిర్భర్‌గా ఎదగగలదని మీరు ప్రపంచానికి నిరూపించారు’ అని ప్రధాని కొనియాడారు. ‘విక్రమ్-1’లో తన ‘వందేమాతరం’ సందేశంతో కూడిన కార్డును కూడా పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శుభాకాంక్షలు సహా ఆ సందేశం కూడా అంతరిక్షంలోకి చేరడం గర్వకారణమన్నారు. ‘ఈ ప్రయోగం ద్వారా ‘వందేమాతరం’ సందేశం మరింత ఉన్నత స్థాయికి చేరి అంతరిక్షంలోనూ మార్మోగింది’ అని మోదీ వ్యాఖ్యానించారు.

శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు ‘మిషన్ ఆగమన్’ పేరిట చేపట్టిన ‘విక్రమ్-1’ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం చేపట్టినప్పటికీ.. అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేయడంతో భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ తొలి కక్ష్య ప్రయోగంలో గ్రహా స్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్‌డ్ సంస్థల సాంకేతిక పేలోడ్‌లు సహా స్కైరూట్ రూపొందించిన స్కోప్ ప్లాట్‌ఫామ్‌నూ పరీక్షించారు. అలాగే ‘కాస్మిక్ బ్లూమ్’ పేరిట ల్యాబ్‌లో తయారైన వజ్రం, భారత శాస్త్రవేత్తలకు అంకితమైన సూక్ష్మ కళాఖండం, రాకెట్ నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల సంతకాలతో కూడిన ప్రత్యేక పేలోడ్‌లనూ కక్ష్యలోకి పంపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!