Thursday, July 16, 2026
Homeఆంధ్రప్రదేశ్అమరావతిలో మొదటి జగన్నాథ రథయాత్ర-చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

అమరావతిలో మొదటి జగన్నాథ రథయాత్ర-చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

📰 Generate e-Paper Clip

రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి జగన్నాథ రథయాత్రకు శ్రీకారం చుట్టారు.

అమరావతి(చైతన్యగళం): రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి జగన్నాథ రథయాత్రకు శ్రీకారం చుట్టారు. రథాన్ని లాగే ముందు ఒడిశాలోని పూరీలో జగన్నాథ స్వామికి నిర్వహించే ప్రత్యేక పూజలను సీఎం చంద్రబాబు నిర్వహించారు.

అనంతరం అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్ర పటాన్ని తలపై పెట్టుకుని అమరావతి విశ్వ నగరంగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పూరీలో నిర్వహించే సంప్రదాయ క్రతువులో భాగంగా జగన్నాథ రథం ముందు భాగాన్ని బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. ఆపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలు ఆశీనులైన రథాన్ని తాడుతో లాగారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక శాసనసభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు రథాన్ని లాగారు.

ఇది పూర్వజన్మ సుకృతం..

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో మొదటిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. భారతదేశంలో జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉందన్న సీఎం.. ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్రలో అందరూ పాల్గొనడం సాధ్యం కాదన్నారు. ఇక నుంచి ప్రతిఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇస్కాన్ ప్రకటించడం సంతోషదాయకమని తెలిపారు. పూరీ రథయాత్రకు ఎంతో విశిష్టత ఉందని, అలాంటి కార్యక్రమాన్ని అమరావతిలోనూ చేపట్టడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

ఇస్కాన్, అక్షయపాత్ర సేవలు అభినందనీయం..

ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రజా సేవలో ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్‌లు చక్కగా పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దేశంలోని 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25 వేలకు పైగా పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఆహారం అందిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున 500 కోట్ల మందికి ఆహారం అందించడం అరుదైన విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా ప్రతిరోజూ 1.80 లక్షల మంది విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందిస్తోందని చెప్పారు.

ఆధ్యాత్మికతతోనే ఒత్తిడికి పరిష్కారం..

మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని, సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం సమాజంపై పడుతోందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాలు వంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మన జీవితాల్లో ఒత్తిడి దూరం కావాలంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. మైక్రో ఫ్యామిలీలు కాకుండా ఉమ్మడి కుటుంబాలు ఉండాలని, అదే భారతీయ సంప్రదాయమని చెప్పారు. సమస్యలను, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనేలా ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీలో 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం..

ఏపీలో 5 వేల శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజం మొత్తాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలే దేవాలయాలని, వాటి ఆధ్యాత్మిక శోభకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నాణ్యమైన జీవనం లేకపోతే ఎంత సంపద ఉన్నా నిరర్థకమని గుర్తించాలని సూచించారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఇస్కాన్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి, పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం..

అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి ఏపీ ప్రజలకు మేలు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్నాథ స్వామి రథయాత్ర తలపెట్టగానే అమరావతిలో వర్షం కురిసి చల్లని వాతావరణం ఏర్పడిందని అన్నారు. ఆ స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!