జమ్మికుంట రూరల్, జూలై 2 (చైతన్యగళం): వెంకటేశ్వర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు పక్కన తాత్కాలిక గుడిసెలో నివసిస్తున్న ఓ నిరుపేద వృద్ధురాలి దయనీయ పరిస్థితి గురించి సమాచారం అందిన వెంటనే 3వ వార్డు సభ్యుడు బండారి ప్రశాంత్ స్పందించారు.వర్షాకాలంలో గుడిసె పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో వర్షపు నీరు లోపలికి చేరి వృద్ధురాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ఆయన, వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం స్వంత ఖర్చుతో తాడిపత్రి అందించి గుడిసెకు కొత్త కవరింగ్ ఏర్పాటు చేసి, వర్షపు నీరు లోపలికి రాకుండా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా వృద్ధురాలిని పరామర్శించిన ప్రశాంత్, “అవసరమైన సహాయం ఎప్పుడైనా అందిస్తాను” అని భరోసా ఇచ్చారు. ఈ సహాయం అందుకున్న వృద్ధురాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తన కష్టసమయంలో అండగా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేశారు.“సేవే లక్ష్యం – ప్రజల సంక్షేమమే ధ్యేయం” అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న బండారి ప్రశాంత్ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు అభినందించారు.
