Sunday, June 21, 2026
Homeఆంధ్రప్రదేశ్పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్

పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్

📰 Generate e-Paper Clip

మాటామంతి కార్యక్రమంలో పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు లేని కులం ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. కొందరు ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో మాట్లాడుతుంటే ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. 

కాకినాడలో నిర్వహించిన ‘మన ఊరు.. మాట మంతి’ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్థులకు కులాలు అంటగట్టడం సరికాదని, వారికి రాజకీయంగా అండగా నిలిచే నాయకులను ప్రజలు దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే వ్యక్తులను ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్థులను ప్రోత్సహిస్తే సమాజ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

సుగాలి ప్రీతి కేసుపై స్పందన

సుగాలి ప్రీతి హత్య కేసును గతంలో సీబీఐకి అప్పగించాలని తాను ఆందోళన చేశానని పవన్‌ కల్యాణ్‌ గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రభుత్వం సీబీఐకి కేవలం తూతూమంత్రంగా లేఖ రాసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించగా, గత ప్రభుత్వ హయాంలోనే కీలక సాక్ష్యాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. నేరస్థులను వెనకేసుకొస్తే అది సమాజానికి మంచిది కాదని, క్రిమినల్‌ గ్యాంగులతో ప్రభుత్వాలు నడవవని స్పష్టం చేశారు. నేర చరిత్ర ఉన్నవారు రాజ్యాంగబద్ధ పదవుల్లో కూర్చొని పాలించాలని ప్రయత్నిస్తే జీవితాంతం పోరాడతానని అన్నారు. నేరస్థులను నెత్తిన పెట్టుకుంటే ప్రజల తలరాతలను ఎవరూ మార్చలేరని వ్యాఖ్యానించారు.

యువతకు పిలుపు

‘జెన్‌జీ’ అని చెప్పుకోవడం కంటే, తమ భవిష్యత్తును యువతే నిర్ణయించుకోవాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. తాను మళ్లీ ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదని, కానీ ప్రజల కోసం పోరాటం మాత్రం కొనసాగిస్తానని చెప్పారు. విపక్షం మళ్లీ అధికారంలోకి వస్తుందేమోనని భయపడాల్సిన అవసరం లేదని, రౌడీయిజం, గూండాయిజానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు నాయకులు కొన్ని అంశాలపైనే స్పందిస్తారని, తాను మాత్రం ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై స్పందిస్తానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు లేని కులం ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే.. కొందరు ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో మాట్లాడుతుంటే మనవైపు ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. అన్నింటికీ తానే మాట్లాడాలంటే ఎలా కుదురుతుందన్నారు. కులాల దరిద్రం వదిలితేనే ఏపీ బాగుపడుతుందన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ చాలా కఠినంగా ఉండాలన్నారు. తాను హోంమంత్రిని కాదని..అది క్రిమినల్స్‌ అదృష్టమని పవన్ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!