మర్రిగూడ, జూలై 16 (చైతన్యగళం):
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన చాపల శివ (23) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, శివ మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు, తుక్కుగూడలో పనిచేస్తున్న భారతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.50 వేల రూపాయలు నగదు, గూగుల్ పే ద్వారా తీసుకుంది. అయితే వాగ్దానం నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తూ, చివరికి బెదిరింపులకు దిగడంతో శివ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగిన శివ, తన అన్నయ్య వినయ్‌కు ఫోన్ చేసి, “భారతి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసింది” అని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తల్లిదండ్రులు అతన్ని వెంటనే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.
మృతుడి అన్నయ్య వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతి పై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
