యాచారం, జూలై 16 (చైతన్యగళం): మహేశ్వరం జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, గురువారం హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, విచారణాధికారుల పనితీరు, శాంతిభద్రతల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లు, బీట్ వ్యవస్థ, నేర నియంత్రణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల నివారణకు చేపడుతున్న చర్యలు, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణ, సమస్యలు, సంక్షేమ అంశాలపై చర్చించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును వెంటనే స్వీకరించి చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తును నాణ్యతతో, పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మహిళలు, చిన్నారులు, వృద్ధులకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాత్రి గస్తీ, బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి డీసీపీ దిశానిర్దేశం చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీలో మహేశ్వరం సబ్‌డివిజన్ ఏసీపీ కె.పి.వి. రాజు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. సత్యనారాయణ, ఎస్‌ఐలు డి. సునీల్ కుమార్, జి. సైదులు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
