Friday, July 10, 2026
Homeతెలంగాణజగిత్యాలచల్‌చల్‌గల్‌లో కేవి కి 5 ఎకరాల కేటాయింపు బీజేపీ పోరాట ఫలితమే - డాక్టర్ భోగ...

చల్‌చల్‌గల్‌లో కేవి కి 5 ఎకరాల కేటాయింపు బీజేపీ పోరాట ఫలితమే – డాక్టర్ భోగ శ్రావణి

📰 Generate e-Paper Clip

జగిత్యాల, జూలై 10 (చైతన్యగళం): జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చల్‌గల్ వాలంతరీ సెంటర్‌లో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.158ను బీజేపీ స్వాగతించింది. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తు కోసం, ధర్మం, న్యాయం కోసం బీజేపీ చేసిన పోరాటానికి దక్కిన ఫలితమని నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి పేర్కొన్నారు.

కమల నిలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ – కేంద్రీయ విద్యాలయానికి చల్‌గల్ ప్రాంతమే అనుకూలమని అధికారులు గుర్తించారని, అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వార్థపూరితంగా తనకు భూములు ఉన్న చోట స్థలాలను ప్రపోజ్ చేయడం వల్ల సంవత్సరం కాలయాపన జరిగిందని విమర్శించారు. చివరికి బీజేపీ నాయకుల పోరాటం ఫలించి విద్యార్థుల ప్రయోజనాలే గెలిచాయని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, పూర్తి స్థాయి కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు అవసరమని శ్రావణి అభిప్రాయపడ్డారు. క్రీడా మైదానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర మౌలిక వసతుల కోసం అదనంగా మరో ఐదు ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

జూలై 12న ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కేవీ భూమిపూజ జరగనున్నట్లు వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయం మంజూరుకు కృషి చేసిన ఎంపీ అరవింద్‌తో పాటు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భూమి కేటాయింపుకు సహకరించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు పార్టీ నాయకులు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. తమ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, 42వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, జిల్లా కార్యదర్శులు పాత రమేష్, ముత్యంరెడ్డి, కాశెట్టి తిరుపతి, పూదరి శ్రీనివాస్, బద్దెల గంగరాజం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!