కరీంనగర్, జూలై 8 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి బొబ్బిలి నిధిశ్రీ పటేల్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్–2026లో తన పేరు నమోదు చేసుకుని విశేష గుర్తింపు పొందింది.
స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న నిధిశ్రీ నాలుగేళ్ల వయసులోనే తైక్వాండో సాధన ప్రారంభించింది. శిక్షణ ప్రారంభమైన కొద్ది నెలల్లోనే తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించి ప్రతిభ చాటింది. మే 27న ఒక రజత నిమిషంలో 112 తైక్వాండో కిక్స్ ప్రదర్శించిన వీడియోను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపగా, జూన్ 3న రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు అధికారికంగా నిర్ధారించారు.
ఇంత చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్న నిధిశ్రీ భవిష్యత్తులో దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మంకమ్మతోట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ముప్పిడి సునీల్ కుమార్ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ కుల పెద్దలు కర్ర రామలింగారెడ్డి, పల్లె రామచంద్రం, దిండిగాల రమేష్, గుర్రాల వెంకటరమణ, ఎన్నం దేవేందర్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
