Tuesday, July 7, 2026
Homeఆంధ్రప్రదేశ్గుప్తనిధుల తవ్వకాల కలకలం..!

గుప్తనిధుల తవ్వకాల కలకలం..!

📰 Generate e-Paper Clip

  • నల్లమల అటవీ ప్రాంతంలో భారీ తవ్వకాల ఆనవాళ్లు
  • ⁠గబ్బు చెలిమా వద్ద క్షుద్రపూజలు జరిగినట్లు ప్రచారం
  • ⁠అటవీశాఖ పర్యవేక్షణపై స్థానికుల అనుమానాలు

నంద్యాల, జూలై 6(చైతన్యగళం): నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి గుప్తనిధుల వేట కలకలం రేపుతోంది. మహానంది నుంచి కృష్ణనంది వైపు వెళ్లే పాత అటవీ మార్గంలోని గబ్బు చెలిమా ప్రాంతంలో భారీ స్థాయిలో తవ్వకాలు జరిగిన ఆనవాళ్లు వెలుగుచూడడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున గుంతలు తవ్విన గుర్తులు కనిపిస్తుండగా, కొందరు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.

ఈ ప్రాంతంలో గతంలోనూ గుప్తనిధులు ఉన్నాయనే ప్రచారం విస్తృతంగా సాగింది. కాలక్రమేణా ఈ పాత అటవీ మార్గం మూసుకుపోవడంతో దానిని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు నిర్వహించినట్లు భావిస్తున్నారు. తవ్వకాల అనంతరం విలువైన వస్తువులు లభించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు.

గబ్బు చెలిమా ప్రాంతం తెలుగుగంగ ప్రధాన కాలువకు, అటవీశాఖ పర్యవేక్షణలో ఉండే మార్గాలకు అత్యంత సమీపంలోనే ఉన్నప్పటికీ, ఇంత భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారుల దృష్టికి ఎలా రాలేదన్న ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అటవీశాఖ నిఘాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ ఘటన వెనుక ఏవైనా అధికారుల నిర్లక్ష్యం లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.

గుప్తనిధుల పేరుతో నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు పర్యావరణానికే కాకుండా పురావస్తు సంపదకు కూడా ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ, పోలీసులు, సంబంధిత శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయడంతో పాటు, ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!