- వ్యాపారాభివృద్ధి, పరస్పర సహకారమే లక్ష్యం
- పాల్గొన్న 250 మంది పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు
- వ్యాపారాభివృద్ధి, నెట్‌వర్కింగ్, పరస్పర సహకారమే లక్ష్యం
హైదరాబాద్, జూన్ 28 (చైతన్యగళం): దేశవ్యాప్తంగా ఉన్న వైశ్య వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న వీ వైశ్య గ్లోబల్ బిజినెస్ కాంక్లేవ్–2026 ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. మాదాపూర్‌లోని హోటల్ ఆవాసలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, యువ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సమిష్టి అభివృద్ధికి నాంది
గ్లోబల్ ప్రెసిడెంట్ మహేంద్ర చీమకుర్తి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కాంక్లేవ్‌ను తెలంగాణ ఎక్స్‌పాన్షన్స్ లీడ్ డాక్టర్ నిషాంక్ కండె, హైదరాబాద్ వీ వైశ్య కౌండిన్య గ్రూప్ అధ్యక్షుడు శ్రీకాంత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వ్యాపార రంగంలో ఉన్న సవాళ్లు, అవకాశాలు, పెట్టుబడుల విస్తరణ, భాగస్వామ్యాల పెంపు వంటి అంశాలపై విస్తృత చర్చలకు ఈ వేదిక అవకాశం కల్పించింది.

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్న వైశ్య వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు భవిష్యత్ వ్యాపార వ్యూహాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
‘ఐ’ నుంచి ‘వి’ వైపు ప్రయాణం
“Stop Thinking I… Start Thinking We” అనే నినాదంతో ముందుకు సాగుతున్న వీ వైశ్య గ్లోబల్ సంస్థ, వ్యాపారవేత్తల మధ్య పరస్పర సహకారం, విశ్వాసం, భాగస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సమిష్టి కృషి ద్వారానే వ్యాపార రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని ఈ కాంక్లేవ్ ద్వారా సంస్థ ప్రతిధ్వనింపజేసింది.

ఆరోగ్యంపై ప్రత్యేక సందేశం
వ్యాపారాభివృద్ధితో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా సమానంగా ముఖ్యమనే ఉద్దేశంతో కార్యక్రమంలో వైద్య నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేశారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సోమనాథ్ గుప్తా మాట్లాడుతూ, వ్యాపారవేత్తలు సంపద సృష్టితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపైనా దృష్టి సారించాలని సూచించారు. సమయపాలన, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి విజయానికి బలమైన పునాదులని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖుల సందడి
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎక్స్‌పాన్షన్స్ లీడ్ సోలార్ వాలా రాజేష్, హైదరాబాద్ కౌండిన్య గ్రూప్ కార్యదర్శి ప్రశాంత్ కుమార్, గ్లోబల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సంతోష్ శెట్టి, ఫస్ట్ గ్లోబల్ ప్రెసిడెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే వ్యాపార నెట్‌వర్క్ నిర్మాణమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.
