ఖానాపూర్, జూన్ 24 (చైతన్యగళం): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలెక్టర్‌ను ఘనంగా స్వాగతించారు.
పాఠశాలలో హాజరు శాతం పెంచి, ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా ఉండేలా చదువుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. భోజనం, అల్పాహారం, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించి, నాణ్యమైన ఆహారం అందించాలని స్పెషల్ ఆఫీసర్‌కు ఆదేశించారు. వర్షాకాలంలో అపరిశుభ్రత లేకుండా గదులు, గ్రౌండ్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగులు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. భోజన్న, తహసీల్దార్ సుజాత, మండల అభివృద్ధి అధికారి రాధా రాథోడ్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
