Wednesday, June 17, 2026
Homeఎడిటోరియల్భక్తి, శక్తి, విశ్వాసానికి చిరునామా.. శ్రీ మహాశక్తి దేవాలయం

భక్తి, శక్తి, విశ్వాసానికి చిరునామా.. శ్రీ మహాశక్తి దేవాలయం

📰 Generate e-Paper Clip

16వ వార్షికోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

ఉత్తర తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా మహాశక్తి క్షేత్రం

 

కరీంనగర్ నగర నడిబొడ్డున చైతన్యపురిలో వెలసిన శ్రీ మహాశక్తి దేవాలయం నేడు ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భక్తి, శక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ దివ్యక్షేత్రం ఈ నెల 19న తన 16వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోనుంది. ఈ సందర్భంగా ఆలయం సర్వాంగ సుందరంగా అలంకరించబడుతూ భక్తులను ఆహ్వానిస్తోంది.

జగద్గురు హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కర్త, కర్మ, క్రియగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం నేడు వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక నిలయంగా మారింది.

త్రిశక్తుల దివ్య దర్శనం

ఈ ఆలయ విశిష్టత ఒకే ప్రాంగణంలో శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరడమే. జగజ్జనని శ్రీచక్ర సంచారిణిగా వెలసిన అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇస్తుంటారు.

 

మహాదుర్గాదేవి ధైర్యాన్ని, రక్షణను ప్రసాదిస్తే.. మహాలక్ష్మి ఐశ్వర్యం, సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తారు. మహాసరస్వతి జ్ఞానం, విద్యా విజయాలకు కారకురాలిగా భక్తుల పూజలు అందుకుంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని “త్రిశక్తుల నిలయం”గా భక్తులు భావిస్తారు.

భక్తుల కొంగుబంగారంగా అమ్మవారు

కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. మనసారా మొక్కుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, కుటుంబ సౌఖ్యం, వ్యాపారాభివృద్ధి, విద్యా విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

ప్రశాంతమైన వాతావరణం, శాస్త్రోక్త పూజలు, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ఆలయ పరిసరాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.

వైభవంగా జరిగే ఉత్సవాలు

శ్రీ మహాశక్తి ఆలయంలో నిత్యం కుంకుమార్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అయితే దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ అవతారాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బతుకమ్మ సంబరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, దాండియా నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

భవానీ దీక్షలకు కేంద్ర బిందువు

విజయవాడ తర్వాత భవానీ మాలధారులకు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ మహాశక్తి దేవాలయం పేరుగాంచింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడ భవానీ మాలలు ధరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇరుముడి, పడి పూజలు ఘనంగా నిర్వహించడం ఆలయ ప్రత్యేకత.

ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవ

ఈ ఆలయం కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా వేదికగా నిలుస్తోంది.

అయోధ్య శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించింది. ప్రతి నెల సంకష్ట చతుర్థి పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తోంది.

ఆవిర్భావం నుంచి ఆధ్యాత్మిక కేంద్రంగా…

2010 జూన్ 17న ప్రారంభమైన ఈ మహిమాన్విత ఆలయం అప్పటి మున్సిపల్ కార్పొరేటర్, ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మించబడింది. హంపి పీఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది.

వేడుకలకు సర్వం సిద్ధం

ఈ నెల 19వ తేదీన జరగనున్న 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, మహా హోమాలు, కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందనున్నారు.

భక్తి విశ్వాసాలకు ప్రతీకగా, త్రిశక్తుల కరుణాకటాక్షాలకు నిలయంగా, ఉత్తర తెలంగాణ ఆధ్యాత్మిక పటంలో చిరస్థాయిగా నిలిచిన శ్రీ మహాశక్తి దేవాలయం నిత్యం భక్తజన హృదయాల్లో వెలుగులు నింపుతోంది.

 

వ్యాసకర్త
దేవిశెట్టి నవీన్ కుమార్
కరీంనగర్

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!