Thursday, November 26, 2026
Homeతెలంగాణకార్తీక పౌర్ణమి వేడుకలు.. ఉమా చంద్రమౌళీశ్వర ఆలయంలో విశేష పూజలు

కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఉమా చంద్రమౌళీశ్వర ఆలయంలో విశేష పూజలు

📰 Generate e-Paper Clip

  • వెయ్యి మట్టి శివలింగాలతో సహస్ర లింగార్చన.. లక్ష పుష్పాలతో పుష్పయాగం
  • జ్వాలా తోరణం, సోమనాథ జ్యోతిర్లింగ దర్శనంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి

మహబూబాబాద్‌ (చైతన్యగళం):

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక అభిషేకాలు, లక్ష పుష్పార్చన, పుష్పయాగం, జ్వాలా తోరణం, సహస్ర లింగార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉదయం గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు, మహాన్యాస పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన దాతల ఆధ్వర్యంలో స్వామివారికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. 16 రకాల పుష్పాలతో శ్రీ సూక్త విధానంలో అర్చనలు నిర్వహించి, లక్ష పుష్పాలతో పుష్పయాగం జరిపారు. పుష్పార్చనకు విరాళాలు అందించిన దాతలకు గర్భాలయంలో కూర్చొని పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇతర భక్తులు కూడా పుష్పాలను స్వామివారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు.

సాయంత్రం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి, పట్టువస్త్రాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నిర్వహించిన సర్వపాప హరణం జ్వాలా తోరణం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. గర్భాలయంలో హిమాలయ పర్వతాల్లో కొలువైన పార్వతీ పరమేశ్వర సమేత సోమనాథ జ్యోతిర్లింగ దర్శనాన్ని కల్పించడంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు.

సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు వెయ్యి మట్టి శివలింగాలతో సహస్ర లింగార్చన నిర్వహించారు. 16 అర్చనలుగా జరిగిన ఈ విశేష పూజ అనంతరం సహస్ర శివలింగాలకు ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. ఒక్కో అభిషేకానికి మూడు, నాలుగు జంటల చొప్పున భక్తులను కూర్చోబెట్టి, ప్రతి జంటకు 11 రకాల అభిషేక ద్రవ్యాలను అందించి పూజలు నిర్వహించారు. సహస్ర లింగార్చనకు అవసరమైన అభిషేక ద్రవ్యాలను బవిరిశెట్టి శ్రీనివాస్‌, విజయ దంపతులు విరాళంగా అందించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన విశేష పూజలు, పుష్పాలంకరణలు, శివారాధనతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారి అన్నావజుల యుగేందర్‌ శర్మ మాట్లాడుతూ.. కార్తీక మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైనదని, కార్తీక పౌర్ణమి రోజున శివుని ఆరాధన, దీపారాధన, అభిషేకాలు, పుష్పార్చనలు చేయడం విశేష ఫలితాలను అందిస్తాయని తెలిపారు. శివనామ స్మరణ, పూజా కార్యక్రమాల ద్వారా మనశ్శాంతి, భక్తిభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఆలయంలో నిర్వహించిన సహస్ర లింగార్చన, లక్ష పుష్పార్చన, పుష్పయాగం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయని అన్నారు. భక్తులు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని దైవచింతనతో ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఆలయ అభివృద్ధికి, పూజా కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తున్న దాతలు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!