- నల్లచెరువును పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం: సర్పంచ్ కట్ట జయమ్మ యాదయ్య
మాడుగుల, నవంబర్ 22 (చైతన్యగళం):
మాడుగుల మండలం నల్లచెరువు గ్రామంలో పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కట్ట జయమ్మ యాదయ్య ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట జయమ్మ యాదయ్య మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యమే గ్రామ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఏ ఒక్క చిన్నారిని కూడా ఈ కార్యక్రమానికి దూరం చేయవద్దని కోరారు.
పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన బాల్యం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని, ప్రజల భాగస్వామ్యంతో నల్లచెరువును పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనలక్ష్మి, సూపర్వైజర్ అండాలు, ఏఎన్ఎం సుధారాణి, వార్డు సభ్యుడు బూతరాజు సురేష్, కట్ట పద్మ జంగయ్య, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

