- కల్వకుర్తిలో సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు.. డిసెంబర్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం
కల్వకుర్తి, నవంబర్ 21 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల యువతకు ఆధునిక సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి, ఉపాధి అవకాశాలకు బాటలు వేయాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో ‘సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ (TASK) సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ ల్యాబ్ సదుపాయంతో పూర్తిగా ఉచితంగా శిక్షణ అందించనున్నారు.
హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి సాంకేతిక కోర్సులు నేర్చుకోలేని గ్రామీణ యువతకు కల్వకుర్తిలోనే నాణ్యమైన శిక్షణ పొందే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ఐటీ, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), జావా ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్‌క్యూఎల్, డేటాబేస్ నిర్వహణ వంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీటితో పాటు డిజిటల్ మార్కెటింగ్, అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, జీఎస్టీ, టాలీ, పన్నుల విధానం, సాఫ్ట్ స్కిల్స్, ఇతర ఐటీేతర అంశాల్లోనూ శిక్షణ అందించనున్నారు.
కేవలం కోర్సుల బోధనకే పరిమితం కాకుండా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి, ఇంటర్వ్యూలకు సన్నద్ధం చేయడం, ఉద్యోగ అవకాశాల కోసం ప్లేస్‌మెంట్ సహకారం కూడా కల్పించనున్నారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో కీలకంగా మారుతున్న ఏఐ, ఎంఎల్‌పై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. ఏఐ ద్వారా సమాచారాన్ని విశ్లేషించడం, ప్రశ్నలకు సమాధానాలు పొందడం, వివిధ పనులను సులభతరం చేయడం వంటి అంశాలను పరిచయం చేస్తారు. మెషిన్ లెర్నింగ్ ద్వారా డేటాను విశ్లేషించి అంచనాలు వేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం వంటి అంశాలను నేర్పించనున్నారు.
ఈ శిక్షణలో భాగంగా పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రాథమిక అంశాలు, డేటా విశ్లేషణ, ఏఐ టూల్స్ వినియోగం, చిన్న ప్రాజెక్టుల పరిచయం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ, బీకాం, బీఏ, బీటెక్, ఎంటెక్, డిప్లొమా విద్యార్థులతో పాటు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్థిక పరిస్థితులు యువత భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. పట్టణ ప్రాంతాల యువతకు అందుతున్న ఆధునిక సాంకేతిక విద్య గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత మెరుగైన భవిష్యత్తు వైపు అడుగులు వేయవచ్చని పేర్కొన్నారు.
శిక్షణ కేంద్రం: కల్వకుర్తి, ఎంఆర్వో కార్యాలయం ఎదురుగా, పాత కృష్ణవేణి జూనియర్ కళాశాల భవనం.
శిక్షణ ప్రారంభం: డిసెంబర్ 1 నుంచి.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 6300 553 467.
గ్రామీణ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడమే సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయం వెల్లడించింది.

