- కేక్ హౌస్ ప్రారంభోత్సవంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, కౌన్సిలర్ పాపిశెట్టి రాము
ఆమనగల్లు, నవంబర్ 11 (చైతన్యగళం): నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలోని శివాజీ పార్క్ సమీపంలో మాడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కేక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేక్ హౌస్ నిర్వాహకుడు నల్లబోలు సాయికిరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపార రంగంలో మంచి గుర్తింపు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, కౌన్సిలర్ పాపిశెట్టి రాము మాట్లాడుతూ యువతలో ఎన్నో నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు.
యువతలో వ్యాపార ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధిపై ఆసక్తి పెరిగినప్పుడే సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు నాగిళ్ల జగన్, చంద్రశేఖర్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
