Saturday, October 24, 2026
Homeసంపాదకీయంభూగర్భ జలాల పరిరక్షణకు ‘108 ఇంకుడు గుంతల’ లక్ష్యం

భూగర్భ జలాల పరిరక్షణకు ‘108 ఇంకుడు గుంతల’ లక్ష్యం

📰 Generate e-Paper Clip

  • షర్టుపైనే పోస్టర్లు.. వీధివీధినా వినూత్న ప్రచారం.. జల సంరక్షణ కోసం జీవీఎల్ ముందడుగు!

మహబూబాబాద్(చైతన్యగళం): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటూ, భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా శ్రీ వాసవి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గర్రెపల్లి వెంకటేశ్వర్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకొని భూగర్భ జలాలను పెంపొందించాలనే సంకల్పంతో 108 ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు.

సాధారణంగా ఏదైనా సామాజిక కార్యక్రమంపై అవగాహన కల్పించాలంటే బ్యానర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటి. అయితే గర్రెపల్లి వెంకటేశ్వర్లు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. జల సంరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన దుస్తులనే ప్రచార సాధనంగా మార్చుకున్నారు. తాను ధరించే షర్టు జేబుపై, షర్టు వెనుక భాగంలో ఇంకుడు గుంతల ఆవశ్యకతను తెలియజేసే పోస్టర్లను ఏర్పాటు చేసుకొని వీధివీధినా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయన వినూత్న ప్రచార శైలి స్థానికంగా ఆకర్షణగా నిలుస్తోంది.

ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టుకోవడమే లక్ష్యం

వర్షపు నీరు వృథాగా కాలువల్లోకి, ఇతర ప్రాంతాల్లోకి వెళ్లిపోకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపడితే భూగర్భ జలమట్టాలు పెరిగేందుకు దోహదపడుతుందని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద, అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను కొంతవరకు నివారించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. 108 ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలు, దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు.

సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందంజ

సమాజ సేవ అనగానే ముందుండే వ్యక్తిగా గర్రెపల్లి వెంకటేశ్వర్లు గుర్తింపు పొందారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడంలో తనదైన శైలిలో ముందుకు సాగుతుంటారు. సేవా కార్యక్రమాల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనంగా ప్రస్తుతం చేపట్టిన ఇంకుడు గుంతల అవగాహన ప్రచారం నిలుస్తోంది. తన ప్రచారం ద్వారా మరింతమంది ప్రజలను చైతన్యవంతులను చేసి, జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయాలన్నది ఆయన సంకల్పం.

మహబూబాబాద్‌లో ‘జీవీఎల్‌’గా సుపరిచితులైన గర్రెపల్లి వెంకటేశ్వర్లు, ఈసారి నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజల్లో చైతన్యం నింపేందుకు చేస్తున్న ప్రయత్నం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. వ్యక్తిగత ప్రచారానికి కాకుండా ప్రజా ప్రయోజనానికి తన వంతు కృషి చేస్తూ, ప్రతి ఒక్కరూ నీటి విలువను గుర్తించి భూగర్భ జలాల పరిరక్షణకు ముందుకు రావాలనే సందేశాన్ని ఆయన అందిస్తున్నారు.

నీటిని కాపాడుకుందాం.. భూగర్భ జలాలను పెంచుకుందాం.. భావితరాలకు నీటి భద్రత కల్పిద్దాం అనే సందేశంతో జీవీఎల్ చేపట్టిన ఈ వినూత్న ప్రచారం జల సంరక్షణపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని ఆశిద్దాం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!