- కొత్త ప్రణాళికతో రూ.400 కోట్లు ఆదా
- అవసరమైన చోటే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు
- జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 5(చైతన్యగళం): కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనుల ప్రణాళికలో జీహెచ్ఎంసీ కీలక మార్పులు చేసింది. పార్క్ చుట్టూ ప్రస్తుతం అమల్లో ఉన్న ఏకమార్గ (వన్‌వే) విధానం, ఉచిత ఎడమ మలుపు (ఫ్రీ లెఫ్ట్)తో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. ఏకమార్గ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. తాజా మార్పులతో ప్రాజెక్టు వ్యయంలో సుమారు రూ.400 కోట్లు ఆదా కానున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు ఒకే ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వరకు ఉక్కు వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిని ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించేలా ప్రణాళికలో మార్పులు చేసినట్లు తెలిపారు.
బ్రిడ్జి, అండర్‌పాస్ పనులు కొనసాగుతున్నాయని.. కొన్ని న్యాయస్థాన కేసుల కారణంగా ప్రణాళికలో మార్పులు చేయాల్సి వచ్చిందని కర్ణన్ వివరించారు. కొత్త ప్రణాళికతో పనులను వేగంగా పూర్తి చేయడంతోపాటు నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
