- ఖరీఫ్–రబీ ధాన్యం మిల్లింగ్, సీఎంఆర్ సరఫరాలో ఇబ్బందులు.. అధికారులతో సమావేశం నిర్వహించాలని వినతి
కరీంనగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): జిల్లాలో ఖరీఫ్, రబీ ధాన్యం సేకరణ, మిల్లింగ్, సీఎంఆర్ సరఫరా, ప్రభుత్వ సంస్థలకు బియ్యం పంపిణీలో రైస్ మిల్లర్లు నిరంతరం సహకరిస్తున్నారని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించింది.
2025–26 సంవత్సరానికి మిల్లింగ్ ధాన్యంలో అధిక భాగం ఉప్పుడు బియ్యానికి అనుకూలంగా ఉందని, ముడి బియ్యం మిల్లింగ్‌లో తెల్లటి మచ్చల శాతం అధికంగా ఉండటంతో విరిగిన బియ్యం శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ఉప్పుడు బియ్యం లక్ష్యాన్ని పెంచడంతో పాటు మిల్లింగ్ రికవరీకి అనుగుణంగా ఓటీఆర్ నిర్ణయించాలని కోరింది. అధిక విరిగిన బియ్యం, తేమ నష్టం, సహజ నష్టం, సార్టెక్స్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భౌతిక పరిశీలన నిర్వహించాలని, సీఎఫ్టీఆర్ఐ, మైసూరు పరీక్షా మిల్లింగ్ వంటి శాస్త్రీయ పరీక్షల ఆధారంగా ఓటీఆర్ నిర్ణయించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం సుమారు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల రబీ, లక్ష మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్‌లో ఉందని తెలిపింది. పాత ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ చేసి సీఎంఆర్ సరఫరాకు అవకాశం కల్పించాలని, ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ ఉన్న నీలం బియ్యాన్ని త్వరగా తరలించి, సిద్ధంగా ఉన్న ఉప్పుడు బియ్యం, సీఎంఆర్‌ను గోదాముల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరింది. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని మిల్లింగ్, సీఎంఆర్ సరఫరాకు అదనపు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
అలాగే మిల్లర్లకు రావాల్సిన మిల్లింగ్ రుసుము, రవాణా సంబంధిత రుసుములు, సంరక్షణ రుసుములు, రవాణా బకాయిలను వెంటనే చెల్లించాలని కోరింది. సార్టెక్స్, ప్రాసెసింగ్ యంత్రాలు నిరంతరం పనిచేయాల్సి ఉన్నందున 200 హెచ్‌పీ వరకు సామర్థ్యం ఉన్న రైస్ మిల్లులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సమస్యలపై జిల్లా అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తక్షణ పరిష్కారం చూపాలని సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రావు, కార్యదర్శి బోనగిరి శశికిరణ్, కోశాధికారి గిరిధర్, డైరెక్టర్లు, మిల్లర్లు కోరారు.
