Saturday, September 5, 2026
Homeతెలంగాణకరీంనగర్రవిదాస్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

రవిదాస్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 5 (చైతన్యగళం): సమాజంలో కుల వివక్షకు తావులేని సమసమాజ స్థాపన, సామాజిక సమరసత కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప ఆధ్యాత్మిక సంస్కర్త సంత్‌ శిరోమణి గురు రవిదాస్‌ మహారాజ్‌ అని బీజేపీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కొనియాడారు. రవిదాస్‌ మహారాజ్‌ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ జాతీయ, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు కరీంనగర్‌లోని శుభ మంగళ కన్వెన్షన్‌ హాల్‌లో బీజేపీ ఎస్సీ మోర్చా ముఖ్య నాయకులు, మండల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రవిదాస్‌ మహారాజ్‌ ఆశయాలకు అనుగుణంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

గ్రామస్థాయిలో సమరసతా కార్యక్రమాలు

రవిదాస్‌ మహారాజ్‌ 650వ జయంతిని పురస్కరించుకుని ‘సామాజిక సమరసతా సంకల్ప్‌ అభియాన్‌’ పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సాయిని మల్లేశం తెలిపారు.

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, కార్యక్రమ కన్వీనర్‌ బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అభియాన్‌లో భాగంగా ఎస్సీ మోర్చా నాయకులు ప్రతి గ్రామంలోని దళితవాడలను సందర్శించి సంత్‌ రవిదాస్‌ బోధనలు, సమానత్వ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రవిదాస్‌ చిత్రపటాలతో శోభాయాత్రలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పేదలకు వస్త్రదానం, అన్నదానం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

నేటి యువతకు సంత్‌ రవిదాస్‌ చూపిన భక్తి మార్గం, కులరహిత సమాజ నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని సూచించారు. రవిదాస్‌ జన్మస్థలం నుంచి సేకరించిన పవిత్ర మట్టితో కూడిన కలశాన్ని జిల్లాకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ కలశాన్ని ప్రతి మండలానికి తీసుకెళ్లి ఘనంగా కలశ వందన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల నాయకులకు కలశాలను అందజేశారు.

దాడిని ఖండించిన బీజేపీ నేతలు

ఇటీవల నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణులు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి, సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై సిరా చల్లి అవమానించడాన్ని సాయిని మల్లేశం, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దళిత వ్యతిరేక చర్యలను బీజేపీ ఎస్సీ మోర్చా ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. సంత్‌ రవిదాస్‌ మహారాజ్‌ కీర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా పదాధికారులు, నియోజకవర్గ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మాడ వెంకటరెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు, సీనియర్‌ నాయకులు గుజ్జ శ్రీనివాస్‌, గుంజేటి శివ, సుగుర్తి జగదీశ్వర్‌చారి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంఘు నరేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, వై. రామానుజం, పుప్పాల రఘు, దండు కొమురయ్య, కరివేద మహిపాల్‌రెడ్డి, అలివేలు సమ్మిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు మోతే గంగారెడ్డి, మండల, జోన్‌ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!