Saturday, September 5, 2026
Homeతెలంగాణకరీంనగర్విద్యా పరిపాలనలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు విశిష్ట ప్రతిభా పురస్కారం

విద్యా పరిపాలనలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు విశిష్ట ప్రతిభా పురస్కారం

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల నమోదు

మంచిర్యాల, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026కు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు.

2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా విశిష్ట ప్రతిభ కనబరిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు ఉండగా.. 2026–27లో ఆ సంఖ్య 45,626కు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 2,554 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 2024–25తో పోలిస్తే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10.34 శాతం పెరిగింది.

జిల్లాలోని 282 ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతానికి పైగా అదనపు నమోదు సాధించారు. మందమర్రి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, భీమారం మండలాల్లోనూ విద్యార్థుల నమోదు 10 శాతానికి పైగా పెరిగింది. ముఖ్యంగా 2026–27 విద్యా సంవత్సరంలో 4,346 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం.. ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.

జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య, విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఐఎస్, సీసీఓలు, సీఆర్‌పీలు సమన్వయంతో చేపట్టిన కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ, సమష్టి కృషి ఈ విజయానికి దోహదపడింది.

విద్యార్థుల నమోదు పెంపుతో పాటు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో మంచిర్యాల జిల్లా సాధించిన ప్రగతికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల విద్యాశాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పురస్కారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో పాటు మంచిర్యాల జిల్లా విద్యాశాఖకు, మొత్తం జిల్లాకు దక్కిన విశిష్ట గౌరవంగా అధికారులు పేర్కొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!