- పోషణ, సంరక్షణ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో దర్యాప్తు.. తదుపరి చర్యలు: జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి
కరీంనగర్, ఆగస్టు 20 (చైతన్యగళం): కుమారులు, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై దీనస్థితిలో ఉన్న వృద్ధ దంపతుల విషయంలో జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన గన్ను లక్ష్మి–మోహన్ దంపతులను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చేరదీసి వెలిచాల గ్రామంలోని స్పందన వృద్ధాశ్రమంలో చేర్పించిన ఘటనపై జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి విచారణకు ఆదేశించారు.
మైత్రి చానల్‌లో ప్రసారమైన కథనం ద్వారా విషయం అధికారుల దృష్టికి వచ్చింది. వివరాల ప్రకారం వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా చిన్న కుమార్తె వద్ద ఉంటున్న వారు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో మంథనిలో నివసిస్తున్న చిన్న కుమారుడి వద్దకు వెళ్లారు. అక్కడ నెల రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం చిన్న కుమారుడు వారిని ఆటోలో కరీంనగర్‌కు పంపించినట్లు తెలుస్తోంది.
కరీంనగర్‌కు చేరుకున్న అనంతరం వృద్ధ దంపతులను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆటో డ్రైవర్ వారిని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లినట్లు సమాచారం. ఆసుపత్రి వరండాలో వర్షంలో దీనస్థితిలో ఉన్న వృద్ధ దంపతులను గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
విషయం తెలుసుకున్న అధికారులు స్థానికంగా ఉంటున్న పెద్ద కుమారుడిని ఆసుపత్రికి రప్పించి వివరాలు తెలుసుకున్నారు. తాను అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, తల్లిదండ్రులను పోషించే ఆర్థిక స్థోమత తనకు లేదని ఆయన తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వృద్ధ దంపతులను చేరదీసి వెలిచాలలోని స్పందన వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించారు.
వృద్ధ దంపతుల పరిస్థితిపై పూర్తి వివరాలను సేకరించి, తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం ప్రకారం విచారణ చేపడతామని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు. వృద్ధులను నిర్లక్ష్యం చేసినట్లు తేలితే బాధ్యత వహించాల్సిన కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
వృద్ధ దంపతులకు అవసరమైన వైద్యం, ఆశ్రయం, భద్రత వంటి అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయడం సామాజికంగా మాత్రమే కాకుండా చట్టపరంగానూ తీవ్రమైన అంశమని అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి స్పష్టం చేశారు.
