- బీసీలకు గ్రామీణ సంస్థల్లో 34 శాతం.. పట్టణ స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్
అమరావతి, ఆగస్టు 18(చైతన్యగళం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది.
చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోదం తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీ పంచాయతీరాజ్ చట్టం–1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది.
మేయర్లు, చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు
బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఉన్నతాధికారులు కేబినెట్‌కు వివరించారు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో మేయర్లు, చైర్మన్లను ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేలా నిర్ణయం తీసుకుంది.
జెడ్పీల సంఖ్య 28కి పెంపు
ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ల సంఖ్యను 28కి పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా కొత్త జెడ్పీలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో జిల్లాల వారీగా స్థానిక సంస్థల పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయనుంది.
